హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు భారీ ఆస్తి మోసాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మాదన్నపేటలో ఒకే భవనాన్ని ఏకంగా 54 మందికి విక్రయించి రూ.4.5 కోట్లు వసూలు చేసిన మోసం బయటపడింది. మరో ఘటనలో అధికారుల సంతకాలు, ప్రభుత్వ కార్యాలయాల సీల్స్‌ను ఫోర్జరీ చేసి నకిలీ ఆస్తి పత్రాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

మౌలాలిలో ఖాళీ స్థలాలను లక్ష్యంగా చేసుకుని, నకిలీ యజమానులను సృష్టించి భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న రౌడీషీటర్‌ ముఠా కూడా పోలీసులకు చిక్కింది. ఈ మూడు కేసుల్లో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు.

ఈ ఘటనల నేపథ్యంలో ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. భూమి లేదా భవనం కొనుగోలు చేసే ముందు యాజమాన్య హక్కులు, పత్రాల అసలుదనం, ప్రభుత్వ రికార్డులు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలని హెచ్చరించారు

హైదరాబాద్‌ నగరంలో ఆస్తి మోసాల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకోవడంతో పాటు నగరంలో ప్రాపర్టీలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఒకే భవనాన్ని 54 మందికి విక్రయించి, దానిని తాకట్టు పెట్టి సుమారు రూ.4.5 కోట్లు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో ప్రభుత్వ అధికారుల సంతకాలు, కార్యాలయాల సీల్స్‌ను ఫోర్జరీ చేసి నకిలీ ఆస్తి పత్రాలను తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు.

ఇక మరో కేసులో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి, నకిలీ యజమానులను సృష్టించి వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న రౌడీషీటర్‌ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసుల్లో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు.

నకిలీ పత్రాలతో ఆస్తి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి సీపీ బి. సుమతి హెచ్చరించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

మాదన్నపేట దారాబ్‌జంగ్‌ కాలనీలో గ్రౌండ్‌ ఫ్లోర్‌, రెండు అంతస్తులు, పెంట్‌హౌస్‌తో ఉన్న ఓ భవనాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి విక్రయించేందుకు నిందితులు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. రషాద్‌ ఉల్‌ ఖైర్‌, ముంతాజ్‌బేగం ఆధీనంలో ఉన్న ఈ భవనాన్ని బ్రోకర్ల ద్వారా ప్రచారం చేస్తూ పలువురు కొనుగోలుదారులను ఆకర్షించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

కొనుగోలుదారులకు నమ్మకం కలిగించేందుకు పెంట్‌హౌస్‌లో నివసిస్తున్న అస్మాబేగంను కిరాయిదారుగా చూపించడంతోపాటు, కొందరికి కొంతకాలం అద్దెను కూడా చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. 2021 మార్చి నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు మొత్తం 54 మంది నుంచి సుమారు రూ.4.5 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో రూ.15 లక్షలు నష్టపోయిన నయీం బాను ఇచ్చిన ఫిర్యాదుతో మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అస్మాబేగంను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

నకిలీ పత్రాలతో మరో మోసం

మరో కేసులో డాక్యుమెంట్‌ రైటర్‌ దేవగుప్తపు వీర వెంకట సత్యనారాయణ, అతని మాజీ డ్రైవర్‌ పోలె రాజుతో కలిసి దాదాపు ఎనిమిదేళ్లుగా నకిలీ ఆస్తి పత్రాల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జీపీఏ, ఎస్‌పీఏ, సేల్‌ డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌, మార్ట్గేజ్‌ రిలీజ్‌ వంటి పత్రాలను నకిలీగా తయారు చేయడంతోపాటు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారుల సంతకాలు, నకిలీ స్టాంపులను ఉపయోగించినట్లు వెల్లడించారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో విలువైన స్థలాలకు సంబంధించిన నకిలీ పత్రాలను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్‌లోని ఓ ఫ్లాట్‌పై దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 25 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు, 41 నకిలీ రబ్బర్‌ స్టాంపులు, పలు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిపై ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.