కౌమార దశ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన కాలం. ఈ సమయంలో శారీరక, మానసిక, సామాజిక పరంగా అనేక మార్పులు వేగంగా చోటుచేసుకుంటాయి. ఈ మార్పులతో పాటు చదువు, సంబంధాలు, భవిష్యత్తుపై ఆందోళనలు టీనేజర్లలో ఒత్తిడి, వ్యాకులతకు దారితీసే అవకాశం ఉంది.

ముఖ్యంగా బాలికల్లో హార్మోన్లలో చోటుచేసుకునే హెచ్చుతగ్గులు, శరీరంలో అకస్మాత్తుగా కనిపించే మార్పులు భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. దీంతో వారు తరచూ మూడ్‌ మార్పులను ఎదుర్కొంటుంటారు. అంతేకాకుండా చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ.. కొంతమంది టీనేజ్‌ అమ్మాయిలు లోలోపల తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు.

అయితే ఈ ఒంటరితనం, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో శ్వాస సాధన (బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్‌) ఉపయోగపడుతుందని ఓ అధ్యయనం సూచిస్తోంది. క్రమం తప్పకుండా శ్వాసపై దృష్టి సారించే సాధనలు చేయడం ద్వారా భావోద్వేగాలను నియంత్రించుకోవడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

చుట్టూ స్నేహితులు, నిరంతరం సాగే సంభాషణలు, ఎప్పటికప్పుడు వచ్చే సందేశాలు ఉన్నప్పటికీ.. ఒక టీనేజ్ బాలిక తనలో తాను తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉంది. అయితే, శ్వాసించే విధానంలో చిన్న మార్పు చేయడం ద్వారా ఇతరులతో అనుబంధం కోల్పోయినట్లు భావించే కొంతమంది బాలికల్లో తిరిగి ‘కనెక్షన్’ భావనను పెంచవచ్చని తాజాగా ఓ అధ్యయనం సూచించింది. 174 మంది కౌమార బాలికలపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

కౌమార దశ అనేది జీవితంలో అత్యంత సున్నితమైన దశల్లో ఒకటి. చదువుల ఒత్తిడి, మారుతున్న స్నేహాలు, తోటి వారి అంచనాలు, శరీరంలో చోటుచేసుకునే మార్పులు, అలాగే కుటుంబం నుంచి లభించే భావోద్వేగ మద్దతు తగ్గినట్లు అనిపించడం వంటి అనేక అంశాలు ఈ వయసులో మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బాలికల్లో ఈ దశలో ఒంటరితనం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.

2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే విషయం స్పష్టమైంది. మధ్య ఆసియా, యూరప్, కెనడాకు చెందిన సుమారు 2.8 లక్షల మంది కౌమార బాలబాలికల నుంచి సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన ఈ అధ్యయనం ప్రకారం, 15 ఏళ్ల బాలికల్లో ప్రతి నలుగురిలో ఒకరికి పైగా తరచూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది. అదే వయసులోని బాలురలో ఈ సంఖ్య 13 శాతంగా నమోదైంది.

ఈ గణాంకాలు కౌమార బాలికల్లో ఒంటరితనం ఎంత విస్తృతమైన సమస్యగా మారిందో తెలియజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్వాస వంటి సులభమైన, రోజువారీ చర్యలో చిన్న మార్పులు మానసికంగా ఇతరులతో తిరిగి అనుబంధం ఏర్పరుచుకోవడంలో ఎంతవరకు సహాయపడతాయనే అంశంపై పరిశోధకుల దృష్టి పెరుగుతోంది.

బాల్యంలో ప్రతికూల అనుభవాలను (Adverse Childhood Experiences — ACEs) ఎదుర్కొన్న కౌమార బాలబాలికల్లో ఒంటరితనం, భావోద్వేగ దూరం వంటి అనుభూతులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వేధింపులు, నిర్లక్ష్యం, తోటి పిల్లల నుంచి ఎదురయ్యే బుల్లీయింగ్‌, కుటుంబ సమస్యలు, ఆప్తులను కోల్పోవడం, ఇంట్లో కొనసాగుతున్న ఘర్షణలు వంటి అనుభవాలు వారి మానసిక, భావోద్వేగ శ్రేయస్సుపై ప్రభావం చూపవచ్చు.

అయితే, ఒంటరితనం అంటే కేవలం మన చుట్టూ మనుషులు లేకపోవడం కాదు. ఉదాహరణకు, ఒక టీనేజ్ బాలికకు ఎంతో మంది స్నేహితులు ఉన్నప్పటికీ, తన భావాలను అర్థం చేసుకునే వారు లేరని లేదా ఇతరులతో తనకు నిజమైన, లోతైన అనుబంధం లేదని ఆమె భావించవచ్చు. అంటే, సామాజికంగా ఒంటరిగా లేకపోయినా, భావోద్వేగపరంగా ఒంటరితనాన్ని అనుభవించవచ్చు.

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ చెప్పినట్లు, ‘‘ఒంటరితనం అంటే మన చుట్టూ మనుషులు లేకపోవడం కాదు.. మన ఉనికిని ఎవరూ నిజంగా అనుభవించడం లేదనే భావన.’’ ఈ భావోద్వేగ అనుబంధం లోపించడం కౌమారదశలో ఆందోళన, నిరాశ, మాదకద్రవ్యాల వినియోగం, చదువులో ఇబ్బందులు వంటి అనేక సమస్యలతో సంబంధం కలిగి ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.