తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రతిపక్ష పాత్రలో ఉంది. అయితే జాతీయ స్థాయి అంశాలపై ఈ రెండు పార్టీలు భిన్నమైన వైఖరిని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ఐఆర్‌ (SIR) వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 10న హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా, ఢిల్లీ స్థాయిలోనూ ఆందోళనలు నిర్వహించే దిశగా పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. మరోవైపు, ఇదే అంశంపై వైసీపీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్రియాశీలక కార్యాచరణకు దిగకుండా.. పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) అంశం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇండి కూటమి పార్టీలు ఢిల్లీలో నిరసనలను ఉధృతం చేస్తున్నాయి. సర్‌ ప్రక్రియపై తమ అభ్యంతరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ సైతం రంగంలోకి దిగింది. ఈ అంశంపై శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు సంఘీభావం తెలిపేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు మద్దతు ప్రకటించి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మరుసటి రోజే హైదరాబాద్‌లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు నిరసనలకు దిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు లోక్‌భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు.

ఇదే సమయంలో సర్‌ ప్రక్రియపై బీఆర్ఎస్ సైతం తన గళాన్ని వినిపిస్తోంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 10న హైదరాబాద్‌లోని తెలంగాణ ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించేందుకు పిలుపునిచ్చింది.

ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సర్‌ ప్రక్రియలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించడంపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర, స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. తొలుత హైదరాబాద్‌లో నిరసనలు చేపట్టి, అనంతరం ఢిల్లీలోనూ ఆందోళనలను విస్తరించాలని గులాబీ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

వాస్తవానికి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలోనూ, ఇటు ఎన్డీయే కూటమిలోనూ భాగస్వామిగా లేదు. అయితే ‘సర్’ అంశంపై మాత్రం ఆ పార్టీ తనదైన వైఖరిని వినిపిస్తోంది. భారత రాజ్యాంగం కంటే ఏదీ గొప్పది కాదని, ఏ ఒక్క భారత పౌరుడి ఓటు హక్కును కూడా హరించే అధికారం ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వ్యవస్థల కంటే వ్యక్తులు గొప్పవారు కాదని వ్యాఖ్యానించారు.

140 కోట్ల మంది ప్రజల కంటే ఒక వ్యక్తి ఎలా ఎక్కువవుతారని ప్రశ్నించిన కేటీఆర్.. జ్ఞానేశ్వర్ కుమార్ పదవి నుంచి వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ‘సర్’ ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని, సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.

అయితే తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్.. రాహుల్ గాంధీని సైతం ట్యాగ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరిని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఏఐ వినియోగంతో రూపొందించే పోస్టులు, ప్రచార వ్యూహాలతో ఈ పార్టీల సోషల్ మీడియా విభాగాలు రాజకీయ చర్చను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సీఈసీ రాజీనామా డిమాండ్ విషయంలో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఒకే అంశంపై కాంగ్రెస్‌తో కొంతవరకు ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ ప్రత్యర్థిత్వం కారణంగా ఆ పార్టీతో కలిసి నడిచే విషయంలో బీఆర్ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *