
- ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శనివారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశం అనంతరం మంత్రులు ఈ వివరాలను వెల్లడించారు.
- డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు యూనిట్ల వారీగా రిజర్వేషన్లు అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల్లో పదవుల వారీగా బీసీ రిజర్వేషన్లు
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సుల మేరకు వివిధ స్థానిక సంస్థల పదవులకు బీసీ రిజర్వేషన్ల శాతాలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు మంత్రులు వెల్లడించారు.
- గ్రామ వార్డు మెంబర్లు: 26.73 శాతం
- సర్పంచులు: 27.95 శాతం
- ఎంపీటీసీలు: 25.55 శాతం
- ఎంపీపీలు, జెడ్పీటీసీలు: 24.60 శాతం
- జెడ్పీ ఛైర్పర్సన్లు: 23.08 శాతం
- పట్టణ వార్డు మెంబర్లు: 32.78 శాతం
- మున్సిపల్ ఛైర్మన్లు: 33.02 శాతం
- మేయర్లు: 35.29 శాతం
జెడ్పీ ఛైర్పర్సన్ల పదవులు మినహా మిగిలిన పలు పదవులకు 24 శాతానికి మించి రిజర్వేషన్లు వర్తించేలా కమిషన్ సిఫార్సులు చేసినట్లు మంత్రులు వివరించారు.
బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచడమే లక్ష్యం
- కమిషన్ సిఫార్సులను అమలు చేస్తూ చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రకాల పదవులకు సంబంధించి బీసీలకు ప్రయోజనం చేకూరేలా కూటమి పార్టీల తరఫున సీట్ల కేటాయింపులు కూడా చేస్తామని స్పష్టం చేశారు.
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన రిజర్వేషన్లతో పోలిస్తే బీసీలకు మరింత మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రస్తుత కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తూనే, బీసీ వర్గాలకు సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
- ఈ నిర్ణయంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజకీయ భాగస్వామ్యం, సీట్ల కేటాయింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
