
భారత్తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కెనడా కీలక అడుగు వేస్తోంది. కెనడా వాణిజ్య మంత్రి మణిందర్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో సుమారు 300 మంది వ్యాపారవేత్తల బృందం అక్టోబర్ 12 నుంచి 17 వరకు భారత్లో పర్యటించనుంది. ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటిస్తూ వాణిజ్య అవకాశాలను అన్వేషించనుంది. ఈ ఏడాది చివరి నాటికి భారత్తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో కెనడా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఇస్తోంది. గత 30 ఏళ్లలో ఇంత పెద్ద స్థాయిలో కెనడా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్కు రావడం ఇదే తొలిసారని సమాచారం.
మళ్లీ గాడిలో పడుతున్న ద్వైపాక్షిక సంబంధాలు
జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో భారత్-కెనడా సంబంధాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఖలిస్థాన్ వేర్పాటువాదం, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. 2023లో కెనడా పార్లమెంట్లో మాట్లాడిన అప్పటి ప్రధాని ట్రూడో.. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందనే ఆరోపణలు చేశారు. భారత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
ఈ పరిణామాలతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడంతో పాటు, దౌత్య సంబంధాలను పరిమితం చేసుకున్నాయి. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలు, భారత్కు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఘటనలపై చర్యలు తీసుకోవడంలో అక్కడి ప్రభుత్వం విఫలమవుతోందని భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కొంతకాలం కెనడా పౌరులకు వీసా సేవలను కూడా నిలిపివేసింది.
మరోవైపు, కెనడా విచారణ సంస్థలు తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించాయి. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత విద్యార్థుల కెనడా ప్రయాణాలపైనా ఈ ఉద్రిక్తతల ప్రభావం కనిపించింది.
ప్రస్తుతం వాణిజ్య సంబంధాల విస్తరణపై కెనడా దృష్టి సారించడం ద్వైపాక్షిక ఆర్థిక సహకారానికి కొత్త అవకాశాలను తెరుస్తోంది. ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చర్చలు ముందుకు సాగితే ఇరు దేశాల వ్యాపార, పెట్టుబడి రంగాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
