• భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 14, 15 తేదీల్లో విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే పున్నమి ఘాట్‌లో నిర్వహించే సరస్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
  • రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 14న సాయంత్రం 6:25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి వెళ్లి రాత్రి 7:20 గంటలకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
  • ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ, ప్రోటోకాల్ అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అక్టోబర్ 15న పున్నమి ఘాట్‌లో నిర్వహించే సరస్ మేళాలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు, లఖ్‌పతి దీదీలతో ఏర్పాటు చేసే విందు కార్యక్రమానికి హాజరవుతారు.
  • మహిళా సాధికారత స్వయం ఉపాధి గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలకు ఈ కార్యక్రమం ప్రాధాన్యం ఇవ్వనుంది. రెండు రోజుల పర్యటన ముగించుకుని అక్టోబర్ 15న మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

  • రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రోటోకాల్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
  • భద్రత, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, కార్యక్రమ వేదికల వద్ద ఏర్పాట్లు, అధికారుల విధుల కేటాయింపు వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *