• తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సోమవారం అమరావతి సచివాలయం నుంచి వర్చువల్‌గా ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్‌ను ఆవిష్కరించారు.
  • తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రూ.2,750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయ్యే తేదీని ముందుగానే నిర్ణయించుకుని, ఆ లక్ష్యానికి అనుగుణంగా పనులు ప్రారంభించాలని సూచించారు. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా భక్తి భావంతో పనిచేసే సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
  • ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్‌లో తిరుమల తరహా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తిరుపతికి వచ్చే ప్రతి ఒక్కరికీ దివ్యమైన అనుభూతి కలిగేలా నగరాన్ని తీర్చిదిద్దాలని తెలిపారు. తిరుపతిలో పవిత్రత, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

తిరుపతి నుంచి రేణిగుంట వరకు క్లీన్, గ్రీన్ సిటీ

  • తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూ పరిశుభ్రమైన, పచ్చదనంతో నిండిన నగరంగా అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని అద్భుతమైన దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
  • టీటీడీ ఉద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా వారికి ఇంటి స్థలాలు కల్పించాలని ఆధునిక వసతులతో కూడిన టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. భక్తుల్లో దైవభక్తితో పాటు సేవాభావాన్ని పెంపొందించేలా గోశాలలను ప్రత్యేక అనుభవ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. గోసేవకు ప్రాధాన్యం కల్పించేలా అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం

  • ప్రకృతిని కాపాడటమే దైవారాధనలో భాగమని చంద్రబాబు అన్నారు. ప్రకృతితో అనుసంధానమయ్యేలా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని సూచించారు. నగరంలోని చెరువులను అనుసంధానించి, వాటి పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు.
  • చెరువుల వద్ద ఉదయాన్నే సుప్రభాతం వింటూ ప్రజలు వాకింగ్ చేసేలా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఆధ్యాత్మికతకు సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడంతో పాటు స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.
  • తిరుమలలో కనిపించే పచ్చదనం తిరుపతిలోనూ ఉండాలని తిరుమల కొండలను చూసినప్పుడు కలిగే ఆహ్లాదకరమైన అనుభూతిని నగరంలోనూ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, టీటీడీ పాలక మండలి సభ్యులు, తిరుపతి జిల్లా కలెక్టర్, తుడా అధికారులు తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *