ఆంధ్రప్రదేశ్‌లోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు ఐదు మేయర్ పదవులను కేటాయించింది. జనరల్ మహిళలకు ఐదు పదవులను రిజర్వ్ చేయగా మరో నాలుగు కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించింది.
ఏ కార్పొరేషన్లో ఏ రిజర్వేషన్ అంటే?
ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించింది. కర్నూలు మేయర్ పదవిని ఎస్సీ మహిళకు, రాజమహేంద్రవరం మేయర్ పదవిని ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేసింది.
కాకినాడ, మచిలీపట్నం మేయర్ పదవులను బీసీ మహిళలకు కేటాయించింది. ఏలూరు, అనంతపురం, చిత్తూరు కార్పొరేషన్ల మేయర్ పదవులను బీసీ జనరల్‌కు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
జనరల్ మహిళలకు ఐదు మేయర్ పదవులు
విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పదవులను జనరల్ మహిళలకు కేటాయించింది.
మరోవైపు తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.