క్రమబద్ధమైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్న పెద్దలకు రోజువారీ ఆహారంలో బాదం పప్పులను చేర్చడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని ఓ శాస్త్రీయ అధ్యయనం సూచించింది. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా నిధులతో 21 నుంచి 55 ఏళ్ల వయస్సు గల 175 మంది భారతీయ పెద్దలపై 20 వారాల పాటు ఈ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ నిర్వహించారు.

ఈ అధ్యయనంలో సాధారణంగా తినే చివ్డా, ఖాక్రా, క్రాకర్స్ వంటి స్నాక్స్‌కు బదులుగా రోజుకు 60 గ్రాముల బాదం పప్పులను (సుమారు 50 బాదం పప్పులు) అందించారు. అనంతరం పాల్గొన్నవారు వెల్లడించిన వివరాల ప్రకారం, వారి నిద్ర నాణ్యతలో మెరుగుదల కనిపించడంతో పాటు, పడుకున్న తర్వాత తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకునే అవకాశం పెరిగింది.

అంతేకాకుండా, పడకపై గడిపిన మొత్తం సమయంలో నిద్రలో ఉన్న సమయం పెరగడం (స్లీప్ ఎఫిషియెన్సీ), రాత్రిపూట మెలకువగా గడిపే సమయం తగ్గడం వంటి సానుకూల మార్పులను పరిశోధకులు గుర్తించారు. అయితే, ఈ ఫలితాలను అర్థం చేసుకునేటప్పుడు అధ్యయనానికి ఉన్న పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలి. బాదం పప్పులు సమతుల్య ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు కానీ, నిద్రలేమికి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. దీర్ఘకాలంగా నిద్ర సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

బాదంలోని పోషకాలు.. నాడీ వ్యవస్థపై ప్రభావం

బాదం పప్పుల్లో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థ పనితీరుకు, కండరాల సాధారణ పనితీరుకు తోడ్పడతాయి. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తికి అవసరం. ఈ రెండూ నిద్ర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే బాదంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కండరాల పనితీరుకు, శరీరంలోని పలు జీవక్రియలకు సహకరిస్తాయి.

అయితే బాదం తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని లేదా నిద్ర సమస్యలు తగ్గుతాయని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. ముఖ్యంగా పాలిసోమ్నోగ్రఫీ (PSG) వంటి పరీక్షల ద్వారా నిద్రకు సంబంధించిన శారీరక మార్పులను మరింత స్పష్టంగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బాదాన్ని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చని పోషకాహార నిపుణురాలు షీలా కృష్ణస్వామి అభిప్రాయపడ్డారు. అయితే నిద్రలేమి దీర్ఘకాలంగా వేధిస్తుంటే బాదం పప్పులపైనే ఆధారపడకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *