జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించగానే చాలామంది వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటుంటారు. తమకు గతంలో సూచించిన యాంటీబయాటిక్స్‌ను మళ్లీ వాడటంతో పాటు, ఇంట్లో మిగిలిపోయిన మందులను కూడా తీసుకుంటారు. అయితే వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా, సమాజవ్యాప్తంగా తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ పల్లవ్ మిశ్రా హెచ్చరిస్తున్నారు.

యాంటీబయాటిక్స్ కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వీటిని సంబంధిత ఇన్ఫెక్షన్‌కు తగిన మందుగా, సరైన మోతాదులో, వైద్యుల సూచనల మేరకే ఉపయోగించాలి. సాధారణ జలుబు, ఫ్లూ వంటి అనేక అనారోగ్య సమస్యలు వైరస్‌ల వల్ల వస్తాయి. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లపై యాంటీబయాటిక్స్ పనిచేయవు.

అయినప్పటికీ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్య పెరిగే ప్రమాదం ఉంది. అంటే బ్యాక్టీరియా ఈ మందులకు లొంగకుండా మారడం వల్ల, భవిష్యత్తులో ఆ ఇన్ఫెక్షన్లను నయం చేయడం కష్టతరమవుతుంది. ఫలితంగా ప్రత్యామ్నాయ మందులు అవసరమయ్యే అవకాశం ఉండటంతో పాటు, చికిత్స ఖర్చులు పెరగవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందువల్ల వైద్యుల సూచన లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. అనారోగ్య లక్షణాలు కొనసాగితే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ను మళ్లీ వాడకూడదు:

వైద్యుడి సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల సరైన మందును ఎంచుకోకపోవడం, తప్పు మోతాదులో వాడటం, సూచించిన సమయానికి తీసుకోకపోవడం వంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అలాగే, లక్షణాలు తగ్గాయని భావించి వైద్యుడు సూచించిన చికిత్సను మధ్యలోనే ఆపేయకూడదు. యాంటీబయాటిక్స్‌ను వైద్యుడి సూచనల ప్రకారం మాత్రమే ఉపయోగించాలి.

గతంలో అనారోగ్య సమయంలో మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ను మరోసారి ఉపయోగించడం కూడా సరికాదని డాక్టర్ మిశ్రా సూచిస్తున్నారు. ఎందుకంటే, ప్రస్తుత అనారోగ్యానికి కారణమైన ఇన్ఫెక్షన్ గతంలో వచ్చిన దానికంటే భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల పాత మందులు ఇప్పుడు పనిచేస్తాయని భావించి వాడటం ప్రమాదకరం. ఇతరులకు సూచించిన యాంటీబయాటిక్స్‌ను తీసుకోవడం, తమ మందులను ఇతరులతో పంచుకోవడం కూడా చేయకూడదు. అవసరమైనప్పుడు వైద్యుడిని సంప్రదించి, ఆయన సూచించిన చికిత్సను మాత్రమే పాటించాలి.

సొంతంగా మందులను మార్చడం లేదా మధ్యలోనే ఆపేయడం వద్దు

యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కొందరిలో వికారం, విరేచనాలు, కడుపునొప్పి, అలర్జీ వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అరుదుగా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇవి పేగుల్లో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. ఇతర మందులు వాడుతున్నవారిలో కొన్ని యాంటీబయాటిక్స్‌తో ఔషధాల మధ్య పరస్పర ప్రభావాలు (డ్రగ్ ఇంటరాక్షన్స్) కూడా ఏర్పడవచ్చు.

స్నేహితులు, కుటుంబ సభ్యులు చెప్పారని, గతంలో వాడిన ప్రిస్క్రిప్షన్ ఉందని లేదా ఆన్‌లైన్‌లో సిఫార్సులు కనిపించాయని యాంటీబయాటిక్స్ తీసుకోవడం సరికాదు. వైద్యుడు సూచించినప్పుడే, ఆయన నిర్దేశించిన మోతాదు, సమయపాలన, చికిత్స వ్యవధికి అనుగుణంగా మందులను వాడాలి. మందులు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు కనిపించినా, అనారోగ్య లక్షణాలు తగ్గకపోయినా సొంతంగా మోతాదును మార్చడం లేదా మందులను నిలిపివేయడం చేయకూడదు. వైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు తీసుకోవాలి.

ముఖ్యంగా, ప్రతి జ్వరం, దగ్గు లేదా గొంతునొప్పికి యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. వైరస్‌ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లపై ఇవి పనిచేయవు. ఇన్ఫెక్షన్‌కు కారణాన్ని గుర్తించిన తర్వాతే తగిన చికిత్సను ఎంచుకోవాలి. యాంటీబయాటిక్స్‌ను పూర్తిగా నివారించడం కాదు.. అవసరమైనప్పుడు, సరైన మందును, సరైన మోతాదులో, వైద్యుల సూచనల మేరకు బాధ్యతాయుతంగా ఉపయోగించడం ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *