ఇప్పటి రోజుల్లో చాలామంది తమ ఆర్ధిక అవసరాలను తీర్చుకునేందుకు వ్యక్తిగత రుణం తీసుకుంటున్నారు. ఈ లోన్‌కు ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం మీ శాలరీ స్లిప్, ఆదాయ వనరుల ఆధారంగా అందిస్తారు. మీరు తిరిగి చెల్లించడంలో విఫలమైతే అనేక పర్యావసానాలు ఉంటాయి.

ఆర్ధిక అవసరాల కారణంగా నగదు అత్యవసరమైనప్పుడు చాలామంది పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. కేవలం ఉద్యోగం, వ్యాపారులు చేసేవారికి మాత్రమే ఈ లోన్ మంజూరు చేస్తారు. ఉద్యోగులు తమ శాలరీ స్లిప్, వ్యాపారులు తమ ఆదాయానికి సంబంధించిన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ఏదైనా స్థిరమైన ఆదాయం ఉంటేనే వ్యక్తిగత రుణం మంజూరవుతుంది. మీకు సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే వెంటనే పర్సనల్ లోన్ పొందవచ్చు.

కొన్నిసార్లు జీతం ఆలస్యంగా జమ కావడం, బ్యాంకింగ్ సిస్టమ్‌లో టెక్నికల్ సమస్యలు, ఆటో డెబిట్ ఫెయిల్ కావడం వంటి కారణాలతో ఈఎంఐ చెల్లించడం ఆలస్యం కావొచ్చు. కొంతమంది ఒక్క ఈఎంఐ లేట్ అయితే ఏమీ కాదని పొరపడుతుంటారు. కానీ ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం జరిగితే భారీగా పెనాల్టీలు పడతాయి. ఆలస్యపు రుసుంలు, పెనాల్టీలు పెద్ద మొత్తంలో కట్టాల్సి వస్తుంది. దీంతో పాటు మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది.

లేట్ ఛార్జీలు, జరిమానా వడ్డీల వల్ల మీరు కట్టాల్సిన మొత్తం పెరుగుతుంది. వారానికి ఒకసారి క్రెడిట్ రిపోర్టును బ్యాంకులు ఏజెన్సీలకు నివేదిస్తాయి. దీంతో మీరు ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైతే మీ క్రెడిట్ రిపోర్టుపై తక్షణం ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో మీకు రుణాలు అందే అవకాశాలు తగ్గుతాయి.

ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం చేస్తే ఆర్ధిక సంస్ధలు మీకు ఆటోమేటెడ్ రిమైండర్లు పంపడంతో పాటు కాల్స్ చేస్తారు. కాల్స్‌ను తిరస్కరించడం కంటే సమాధానం ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే మీ సమస్యకు ఆర్ధిక సంస్థలు పరిష్కారాన్ని చూపించవచ్చు. పెనాల్టీలు తొలగించడం లాంటివి చేసే ఆస్కారం ఉంటుంది. తిరిగి చెల్లింపు పరిష్కారాలకు మీకు సహాయం చేసే ఛాన్స్ ఉంటుంది.

ఒక నెల ఈఎంఐను తర్వాతి నెలకు వాయిదా వేయడం వల్ల ఒకేసారి రెండు ఈఎంఐలు చెల్లించడం భారమవుతుంది. దీని వల్ల మీరు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ ఉంటుంది. వెంటనే చెల్లించడం వల్ల పెనాల్టీల భారం తగ్గుతుంది. దీంతో మీరు కొన్ని నెలలకు ఈఎంఐ చెల్లించడానికి కావాల్సిన నిధులను సిద్దం చేసి పెట్టుకోండి. అత్యవసర నిధిని ఉంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీ దగ్గర అత్యవసర నిధులు ఉంచుకోవడం ఊహించని ఘటనల వల్ల ఈఎంఐ చెల్లించలేని పరిస్థితుల్లో అవి ఉపయోగపడతాయి.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *