
కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ బుక్కులు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే అప్లై చేసుకున్న 62 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి.. నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత.. తుది జాబితాను రెడీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక అదే పథకాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రం ఈ రైతు భరోసా అందడం లేదు. దీంతో ఆ రైతులు తమకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం.. వారికి కూడా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది.
కొత్తగా పట్టాదారు పాసు బుక్కులు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని.. కొత్తగా భూములు కొనుగోలు చేసి.. పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ బుక్కులు పొందినవారు సుమారు 85 వేల మంది రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు

