
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపటంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అమరావతి బిల్లుపై చర్చను తాను టీవీలో చూశానన్న లోకేష్.. ఆ సమయంలో ఉద్వేగంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొన్నారు. అమరావతి అజరామరమన్న నారా లోకేష్.. వైఎస్ జగన్ అమరావతిలో ఒక్క ఇటుకను కూడా తాకలేడంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లు ప్రవేశపెట్టగా.. సుమారుగా రెండు గంటల చర్చ అనంతరం లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందంటూ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. నా రాజధాని అమరావతి అజరామరం అంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
“ఈ రోజు లోక్‌సభలో అమరావతి రాజధానిగా చట్టబద్థత కల్పించే బిల్లు ఆమోదం పొందుతున్న వేళ, నేను పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగాన్ని విన్నాను. ఆ సమయంలో నా భావోద్వేగాలను ఆపుకోలేకపోయా. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు. ఇది వేలాది మంది రైతుల త్యాగఫలం. ఓ నమ్మకం, కన్నీళ్లు, మొక్కవోని ధైర్యంపై నిర్మితమైన ఒక స్వప్నం. దేవతల రాజధాని అయిన అమరావతి, ఎన్నో తుఫానులను, ఎన్నో ద్రోహాలను, ఎన్నో సందేహాలను తట్టుకుని నిలబడింది.. ఏనాడూ వెనుకంజ వేయలేదు. అమరావతి కోసం తమ భూమిని, తమ భవిష్యత్తును, తమ నమ్మకాన్ని ఉంచిన ప్రతి రైతుకూ – ఈ క్షణం మీకే అంకితం. మీ త్యాగమే అమరావతిని చిరంజీవిగా నిలిపింది.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

