ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజీనామా చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన కార్యాలయం స్పందించింది. ‘Deputy CMO, Andhra Pradesh’ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ ఛానల్ తమ అధికారిక ఛానల్ కాదని స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరును గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయడంపై తీవ్రంగా హెచ్చరించింది.

ఈ అనధికారిక ఛానల్ ద్వారా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం లేని అంశాలను ప్రచారం చేస్తూ అధికారిక సమాచారంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కార్యాలయం పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయం పేరుతో తప్పుడు గుర్తింపును ఉపయోగించడం అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.

ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అవసరమైన చర్యలు ఇప్పటికే చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. నకిలీ ఛానల్ నిర్వాహకులను గుర్తించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రజలు ఈ ఛానల్‌ను విశ్వసించవద్దని అనుసరించవద్దని అందులో వచ్చే సందేశాలను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని సూచించింది.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రామాణిక సమాచారం తాజా అధికారిక ప్రకటనల కోసం గుర్తింపు పొందిన సోషల్ మీడియా ఖాతాలు, ధృవీకరించిన వాట్సాప్ ఛానల్‌ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ కార్యాలయాల గుర్తింపును దుర్వినియోగం చేసే వారిని ఉపేక్షించబోమని, బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని కార్యాలయం స్పష్టం చేసింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *