దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ గరిష్ఠ స్థాయి నుంచి 1,000 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ 22,500 పాయింట్ల దిగువకు చేరింది. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాల్లో ముడి చమురు ధరల పెరుగుదల ఒకటి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 113 డాలర్లకు పైగా చేరడం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది. సౌదీ అరేబియాపై హౌతీ దాడుల నేపథ్యంలో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చన్న భయాలు పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ షేర్ల విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు.

ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్‌ స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో పతనం మరింత తీవ్రంగా కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 3 శాతానికి పైగా నష్టపోగా మిడ్‌క్యాప్‌ సూచీలు సుమారు 1.4 శాతం పడిపోయాయి. నిఫ్టీ-50లోని పలు కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు కూడా ప్రధాన సూచీలపై ప్రభావం చూపాయి.

వరుసగా కొనసాగుతున్న విక్రయాల కారణంగా చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్లలో బలహీనత కొనసాగుతున్నప్పటికీ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) గురువారం భారత ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ.1,022 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII) సైతం రూ.1,614 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. అయినప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు ముడి చమురు ధరల పెరుగుదల షేర్లలో అమ్మకాల ఒత్తిడి శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో చమురు ధరల కదలికలు ప్రపంచ మార్కెట్ల పరిణామాలు దేశీయ సూచీల దిశను నిర్ణయించడంలో కీలకంగా మారనున్నాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *