యువశక్తిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారానే బలమైన భారత్‌ను నిర్మించగలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని భారత్‌ మండపంలో నిర్వహించిన ‘చిన్మయ అమృత మహోత్సవ గ్లోబల్‌ సమ్మేళన్‌’ను ఆయన ప్రారంభించారు. చిన్మయ మిషన్‌ 75 ఏళ్ల వేడుకల ముగింపు కార్యక్రమాలు అక్టోబర్‌ 25 వరకు కొనసాగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ 1993లో ఆధ్యాత్మిక గురువు స్వామి చిన్మయానందతో జరిగిన తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ భేటీలో దేశాభివృద్ధిలో యువత పాత్ర, యువశక్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఆ సమావేశం జరిగిన కొన్నేళ్లకే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు లభించిందని చెప్పారు. అప్పటి నుంచి తన విధానాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

చికాగోలో నిర్వహించిన ‘పార్లమెంట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ రిలీజియన్స్‌’ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని తాను ఆహ్వానించినప్పుడు స్వామి చిన్మయానంద అంగీకరించిన విషయాన్ని కూడా ప్రధాని గుర్తుచేసుకున్నారు. చిన్మయ మిషన్‌ ఒక సాధారణ సంస్థ మాత్రమే కాదని, సనాతన ఆధ్యాత్మిక తత్వానికి ప్రతిరూపమని మోదీ అభివర్ణించారు.

భారతదేశానికి తన నాగరికతా మూలాలే ప్రత్యేక గుర్తింపునిస్తాయని మన సంస్కృతి ప్రాచీన సంప్రదాయాల్లో వేళ్లూనుకుందని పేర్కొన్నారు. చిన్మయ అమృత మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 300 రోజులపాటు 40 వేల కిలోమీటర్లు ప్రయాణించి, లక్షలాది మందిని కలుసుకున్న యువత బృందాన్ని ప్రధాని అభినందించారు.

ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత చేస్తున్న కృషిని ప్రశంసించారు. వేదాంతం, భగవద్గీత బోధనలను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో స్వామి చిన్మయానంద 1951లో చిన్మయ మిషన్‌ను స్థాపించారు. ఏడు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *