
విజయవాడ మేయర్ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తనను వ్యక్తిగతంగా విమర్శించనని స్వతంత్ర అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించడంపై కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ స్పందించారు. అనుభవం ఉన్నవారి సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటామని స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేసేవారికి ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయని వ్యాఖ్యానించారు.
నగరాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
విజయవాడకు అవసరమైన నిధులు తీసుకొచ్చి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వంగవీటి రాధా తెలిపారు. నగరంలోని సమస్యలపై కేవలం హామీలు ఇవ్వకుండా, కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడలో శాంతిభద్రతలు, ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి నేతలంతా ఒకే టీమ్‌గా పనిచేస్తున్నారని, పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు.
ఏబీ వెంకటేశ్వరరావు సలహాలు తీసుకుంటా
ఏబీ వెంకటేశ్వరరావుకు పరిపాలనలో అనుభవం ఉందని, ఆయన సూచనలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వంగవీటి రాధా తెలిపారు. ఆయన దగ్గర ఉన్న మేధావుల సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా ఏబీ వెంకటేశ్వరరావు సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు.
మరోవైపు, వంగవీటి రాధాతో తనకు 20 ఏళ్లకు పైగా పరిచయం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు గతంలో పేర్కొన్నారు. ఆయనను వ్యక్తిగతంగా విమర్శించబోనని స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని, ఇది కేవలం రాజకీయ పోటీ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
విజయవాడ మేయర్ పదవికి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్సీపీ తరఫున మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దీంతో విజయవాడ మేయర్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
