ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీల నేతల కుటుంబ సభ్యులు జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి నలుగురు వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి సిద్ధమయ్యారు.

రెండు జెడ్పీటీసీ స్థానాలకు మజ్జి శ్రీనివాసరావు కుమార్తె నామినేషన్

ఇటీవల టీడీపీలో చేరిన జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన కుమార్తె సిరి సహస్రతో నామినేషన్ వేయించారు. ఆమె కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి నిమిషంలో ఆమె రెండు స్థానాల నుంచి నామినేషన్లు వేయడం చర్చనీయాంశమైంది.

మరోవైపు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య గరివిడి జెడ్పీటీసీ స్థానానికి, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ భోగాపురం జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు.

బొత్స కుటుంబం నుంచి నలుగురు పోటీ

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన కుమార్తె అనూష బొండపల్లి నుంచి, కోడలు పూజిత గరివిడి నుంచి, సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి గుర్ల నుంచి, తమ్ముడి కుమారుడు బొత్స చైతన్య పూసపాటిరేగ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు.

గరివిడి జెడ్పీటీసీ స్థానంలో బొత్స కుటుంబానికి చెందిన పూజిత, కళా వెంకట్రావు కోడలు సంధ్య పోటీకి సిద్ధమవడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు

విజయనగరం జిల్లాలోని 27 మండలాల జెడ్పీటీసీ స్థానాలకు చివరి రోజు 141 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 20, రెండో రోజు 97 నామినేషన్లు రావడంతో మొత్తం సంఖ్య 258కు చేరింది. ఎంపీటీసీ స్థానాలకు 2,577 నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల పరిశీలన అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. ప్రధాన పార్టీల నేతల కుటుంబ సభ్యులు పోటీలో ఉండటంతో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *