ఆంధ్రప్రదేశ్‌లో 17 మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీకి 15, జనసేన, బీజేపీలకు ఒక్కొక్క ఛైర్‌పర్సన్ పదవి దక్కాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన డాక్టర్ దొంతం గాయత్రి 24 ఏళ్లకే రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.

పది రోజుల క్రితమే రాజకీయాల్లోకి..

రాజంపేటకు చెందిన గాయత్రి తండ్రి దొంతం శివప్రసాద్ టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈ ఏడాది బీడీఎస్ పూర్తి చేసిన గాయత్రి వైద్యవృత్తిలో స్థిరపడాలని భావించారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఛైర్‌పర్సన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మరో ఇద్దరి నామినేషన్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురికావడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజంపేట అభివృద్ధే లక్ష్యం

పట్టణ అభివృద్ధికి కూటమి నాయకుల సహకారంతో కృషి చేస్తానని గాయత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే చదువును కూడా కొనసాగించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఇతర మున్సిపాలిటీల్లోనూ ఏకగ్రీవాలు

కడప జిల్లాలో బద్వేల్ నుంచి ఎస్. దివ్యతేజ, ప్రొద్దుటూరు నుంచి నంద్యాల రాఘవరెడ్డి, కమలాపురం నుంచి జి. స్వప్న, మైదుకూరు నుంచి ధనపాల జగన్‌మోహన్ (టీడీపీ), ఎర్రగుంట్ల నుంచి మధులత (బీజేపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నమయ్య జిల్లాలో పుంగనూరు నుంచి నయీం తాజ్, రాయచోటి నుంచి షేక్ ఖాదర్ వలీ (టీడీపీ) విజయం సాధించారు. పులివెందుల మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో 20 వార్డులు కూటమికి ఏకగ్రీవమయ్యాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *