కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాసంలో కూటమి పార్టీల నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, కూటమి పార్టీల ఐక్యత, ఎన్నికల ప్రచారంపై నేతలు చర్చించారు.
సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరును దేశంలోనే నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి, ప్రస్తుతం జరుగుతున్న పనులకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని సూచించారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనుల్లో కేవలం ఐదు శాతం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. 2027 జూన్ 12 నాటికి నగరంలో యూజీడీ పనులను పూర్తి చేసి దోమల సమస్య లేని నగరంగా నెల్లూరును తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఖజానా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరారు. మంత్రి నారాయణ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు ముందుంటారని తెలిపారు.
నారాయణ, కోటంరెడ్డి సమన్వయంతో పనిచేస్తూ నెల్లూరు అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. నగరంలో ఎక్కడ చూసినా ఎండ్-టు-ఎండ్ రోడ్లు, ఆధునిక పార్కులు, క్లోజ్డ్ డ్రైనేజీ వ్యవస్థ కనిపిస్తున్నాయని వివరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36 డివిజన్లలో ఎనిమిది డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. పలుచోట్ల వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారని ప్రస్తుతం డమ్మీ అభ్యర్థులే మిగిలారని వ్యాఖ్యానించారు.
ఓటమి భయంతో వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా కూటమి పార్టీల విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు.
కూటమి నేతలంతా సమష్టిగా పనిచేస్తున్నారని తెలిపారు. జనసేన నేత వేములపాటి అజయ్ మాట్లాడుతూ కూటమి పార్టీల విజయం ద్వారానే నెల్లూరు మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.