ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం మెరుస్తుందని చాలామంది భావిస్తారు. అయితే, ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ జుష్య భాటియా సరిన్ ప్రకారం, ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకోవడం లేదా మూసుకుపోవడం జరగదు. ఇది చర్మం పైపొరను మృదువుగా చేసి, మృతకణాలు, అదనపు జిడ్డును తొలగించడంలో సహాయపడవచ్చు. అయితే, అతిగా ఆవిరి పట్టడం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబడటం, చికాకు కలగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే చర్మతత్వాన్ని బట్టి, నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖానికి ఆవిరి పట్టేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అందమైన, కాంతివంతమైన చర్మం కోసం చాలామంది ఫేషియల్ స్టీమింగ్ (ముఖానికి ఆవిరి పట్టడం) చేస్తుంటారు. ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని, మురికి తొలగిపోయి ముఖం మెరుస్తుందని భావిస్తారు. అయితే, ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకోవు, మూసుకుపోవు అని ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ జుష్య భాటియా సరిన్ వివరిస్తున్నారు. ఆవిరి వల్ల చర్మం పైపొర మెత్తబడి, మురికి, అదనపు నూనెలు, మృతకణాలు తొలగించడం కొంత సులభమవుతుంది. అయితే, దీనివల్ల నల్లటి మచ్చలు, మొటిమలు పూర్తిగా మాయమవుతాయని భావించకూడదు.
ఆవిరి పట్టాలనుకునేవారు ఎక్కువసేపు చేయకుండా జాగ్రత్తపడాలి. అధిక వేడి, ఎక్కువసేపు ఆవిరి పట్టడం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబడటం, చికాకు కలగడం వంటి సమస్యలు రావచ్చు. ఆవిరి పట్టే నీటిలో నిమ్మరసం, ఉప్పు, ఎసెన్షియల్ ఆయిల్స్ కలపాల్సిన అవసరం లేదు. సాధారణ నీటిని ఉపయోగించడం మంచిది. ఆవిరి పట్టిన తర్వాత ముఖాన్ని తువ్వాలుతో గట్టిగా రుద్దకుండా మెల్లగా తుడుచుకుని, మాయిశ్చరైజర్ రాయాలి. సున్నితమైన చర్మం, రోసేసియా వంటి సమస్యలు ఉన్నవారు ఆవిరి పట్టడం వల్ల ఇబ్బందులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. చర్మ సంరక్షణలో ఆవిరి ఒక్కటే పరిష్కారం కాదని, చర్మానికి తగిన పద్ధతులను పాటించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
