తిరుపతి, అక్టోబరు 26: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారంపై ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, వీడియోలు, లఘుచిత్రాలు రూపొందించే కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సూచించారు.

అభ్యంతరకర ప్రచారానికి దూరంగా ఉండాలి

కులాలు, మతాలు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లేదా అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచార కంటెంట్ రూపొందించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే అంశాలను ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నిరంతరం పరిశీలిస్తాయని తెలిపారు.

చెల్లింపు పోస్టుల ఖర్చులూ ఎన్నికల వ్యయంలోకే

రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరఫున నిర్వహించే చెల్లింపు ప్రచారాలు, ప్రాయోజిత పోస్టులు, ప్రచార ఒప్పందాల ద్వారా చేపట్టే కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో నమోదు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రచారాలకు చెల్లించే రుసుముల వివరాలను ఎన్నికల అధికారులకు పారదర్శకంగా వెల్లడించాలని సూచించారు.

ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

అభ్యర్థులకు సంబంధించిన ప్రచార ప్రకటనలు, వీడియోలు, ఇతర ఎన్నికల ప్రచార సామగ్రిని సోషల్ మీడియాలో ప్రచురించే ముందు నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి మీడియా ధ్రువీకరణ, పర్యవేక్షణ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు అనుమతి పొందాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలను ఉల్లంఘించకుండా ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *