
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్ల ముద్రణకు సంబంధించి గతంలో అమల్లో ఉన్న నిబంధనలను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థులను మూడు విభాగాలుగా వర్గీకరించాలని ఎస్ఈసీ సూచించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇతర అభ్యర్థులుగా విభజించి వివరాలను ముద్రించాలని స్పష్టం చేసింది.
పోస్టల్ బ్యాలెట్ ప్యానెల్‌పై అభ్యర్థి పేరు పార్టీ పేరును తొలుత తెలుగులో ఆ తర్వాత ఆంగ్లంలో ముద్రించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ఎలాంటి ఎన్నికల గుర్తులను ముద్రించకూడదని మరోసారి స్పష్టం చేసింది.
ఏ రాజకీయ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థుల పేర్ల కింద తెలుగులో ‘స్వతంత్ర’ అని ఆంగ్లంలో ‘Independent’ అని ముద్రించాలని సూచించింది. అలాగే సాధారణ బ్యాలెట్ పత్రం పోస్టల్ బ్యాలెట్ పత్రం రెండింటిలోనూ అభ్యర్థుల పేర్ల వరుసక్రమం ఒకే విధంగా ఉండాలని స్పష్టం చేసింది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఏకరూపత ఉండేలా ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధిత అధికారులకు సూచించింది.
