
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్య, దివంగత ఎన్టీ రామారావు సేవలు దేశంలో ఆరోగ్య రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఆయన కీలక ప్రసంగం చేశారు.
విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, సంస్కృతి, తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీ రామారావు చేసిన సేవలను ఉపరాష్ట్రపతి కొనియాడారు. దేశంలోనే తొలి వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో ఎన్టీఆర్ చూపిన దూరదృష్టి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ‘తెలుగు గంగ’ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి ఆయన దాతృత్వానికి మానవతా దృక్పథానికి నిదర్శనమని గుర్తుచేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన దిశగా దేశంలో వైద్య రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, వైద్య విద్య సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు.
ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి నోబెల్ గ్రహీతలు రావాలి
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనల్లో గుర్తింపు సాధించాలని భవిష్యత్తులో ఈ విశ్వవిద్యాలయం నుంచి నోబెల్ బహుమతి గ్రహీతలు రావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మెరుగైన చికిత్సా విధానాలను కనుగొనేలా అధునాతన పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ హెల్త్ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్న ఆయన సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా వైద్యులు మానవీయ స్పర్శను మరిచిపోకూడదని సూచించారు. వైద్య వృత్తిలో కరుణ, మానవత్వం, రోగుల పట్ల ఆప్యాయత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
డ్రగ్స్ నిర్మూలనకు యువత కృషి చేయాలి
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు వైద్యులు యువత చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో వైద్యులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకలు వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో మరింత పురోగతి సాధించాల్సిన అవసరాన్ని చాటిచెప్పాయి
