
ఇచ్చాపురం, పార్లమెంట్ నుంచి మున్సిపాలిటీ, వార్డు స్థాయి వరకు కూటమి ప్రజాప్రతినిధులు అధికారంలో ఉంటే అభివృద్ధి పనులను మరింత వేగంగా చేపట్టవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పట్టణంలోని 28 వార్డుల్లో పర్యటించిన మంత్రి.. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఆశి లీలా రాణితో పాటు కూటమి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో తనను ఎంపీగా, బెందాళం అశోక్‌ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన ఇచ్చాపురం ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఇచ్చాపురం పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద రూ.70 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ నిధులతో అవసరమైన పనులు చేపట్టి ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
పట్టణంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులను మెరుగుపరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి ఇచ్చాపురాన్ని మరింత అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలోనూ కూటమి పాలన ఏర్పడితే ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో వేగంగా అమలు చేయవచ్చని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి ఆశి లీలా రాణి సహా కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని రామ్మోహన్ నాయుడు కోరారు.
