నంద్యాల, అవినీతి రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని, అవినీతి నిర్మూలనలో యువత, విద్యావంతులు చురుకుగా భాగస్వాములు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు.

అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) టోల్‌ఫ్రీ నంబర్ 1064 పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో అవినీతి నిరోధక చైతన్యాన్ని పెంపొందించి, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

అక్టోబర్ 26 నుంచి 31 వరకు జిల్లాలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టర్ల ప్రదర్శన, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు, విజిలెన్స్ అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అక్టోబర్ 30న ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064పై ప్రచారం చేపట్టాలని సూచించారు. అక్టోబర్ 31న మండల కేంద్రాల్లో ప్రజలు, తహసీల్దార్లు, ఎంపీడీవోల సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అవినీతిపై సమాచారం ఇవ్వండి

ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు గుర్తిస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా 9440440057కు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ రామాంజనేయులు, ఎస్‌ఐ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *