శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయ హుండీల ఆదాయం భారీగా సమకూరింది. 32 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.4,22,29,240 నగదు లభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు బంగారం, వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా భక్తులు కానుకలుగా సమర్పించారు.

32 రోజుల్లో రూ.4.22 కోట్ల ఆదాయం

శ్రీశైలం మల్లన్న ఆలయంతో పాటు ఉభయ దేవాలయాలు, పరివార దేవతల ఆలయాల హుండీలను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 25 వరకు భక్తులు సమర్పించిన కానుకల కోసం లెక్కించారు. ఈ లెక్కింపులో 75.300 గ్రాముల బంగారం, 2.900 కిలోల వెండి లభించాయి.

అమెరికా డాలర్లు, యూఏఈ దిర్హమ్స్, బ్రిటన్ పౌండ్లు, కెనడా డాలర్లు, యూరోలు, సింగపూర్ డాలర్లు సహా పలు దేశాల కరెన్సీ కూడా హుండీల్లో లభించింది.

హుండీల లెక్కింపును పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా మధ్య అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. డిప్యూటీ ఈవో ఎస్. చంద్రశేఖర్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

పంచమఠాల్లో లోకకల్యాణ పూజలు

మరోవైపు, లోకకల్యాణం కోసం శ్రీశైలంలోని పంచమఠాల్లో సోమవారం ప్రత్యేక అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించారు. తొలుత ఘంటామఠంలో పూజలు ప్రారంభించి, అనంతరం భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠాల్లో నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్ని పఠించారు. దేశంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

శ్రీశైల చరిత్రలో పంచమఠాలకు ప్రత్యేక స్థానం

శ్రీశైలం ఆధ్యాత్మిక చరిత్రలో మఠాలు కీలక పాత్ర పోషించాయి. ఆలయ నిర్వహణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తులకు సదుపాయాల కల్పనలో ఇవి ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుతం ఆలయానికి సమీపంలోని వాయువ్య ప్రాంతంలో ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠం పంచమఠాలుగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో శిథిలావస్థకు చేరిన ఘంటామఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠాలను ప్రాచీన నిర్మాణశైలికి భంగం కలగకుండా పునరుద్ధరించారు. భీమశంకరమఠానికి మరమ్మతులు చేపట్టారు. ఈ మఠాల్లోని దేవతామూర్తులకు నిత్యం ధూపదీప నైవేద్య పూజలు నిర్వహిస్తున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *