విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొని అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేశ్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి, సంస్కృతికి ఈ ఉత్సవం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు, సిరిమానోత్సవం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను రథోత్సవాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

భక్తుల రాకపోకల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే రాష్ట్రంలో తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో సిరిమానోత్సవంపై వాతావరణ పరిస్థితుల ప్రభావం పడే అవకాశం ఉండటంతో భక్తుల్లో ఆసక్తి నెలకొంది. అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *