రాష్ట్రంలో తీర ప్రాంత ప్రజలను అవసరమైన సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ ఫ్రీ నంబర్లు 1070, 112లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఆర్నబ్‌ తుపాను నేపథ్యంలో మంగళవారం అమరావతిలో వివిధ శాఖల అధికారులతో మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అతి తీవ్ర తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు.

విపత్తు నిర్వహణకు సంబంధించిన శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనిత స్పష్టం చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. తీర ప్రాంత ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *