ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు నేతల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కోవూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు లేఖ రాశారు.

ఇద్దరు నేతలపై సస్పెన్షన్ వేటు?

ఇందుకూరుపేట మండలానికి చెందిన బట్టేపాటి నరేంద్ర రెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన పోతిరెడ్డి నాగ సుబ్బారెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రసన్నకుమార్ రెడ్డి తన లేఖలో కోరారు. వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు, ప్రలోభాలకు లోనై జెడ్పీటీసీ అభ్యర్థులుగా వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఆరోపించారు.

బట్టేపాటి నరేంద్ర రెడ్డి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగ అధికార ప్రతినిధిగా, పోతిరెడ్డి నాగ సుబ్బారెడ్డి వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వీరిద్దరూ నామినేషన్లు ఉపసంహరించుకోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఆరోపణలను ఖండించిన నరేంద్ర రెడ్డి

తనపై వస్తున్న ఆరోపణలపై బట్టేపాటి నరేంద్ర రెడ్డి స్పందించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వద్ద డబ్బులు తీసుకుని నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తనను ఎవరూ ప్రలోభపెట్టలేదని తెలిపారు.

ప్రత్యర్థి పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దించినప్పుడు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ముందునుంచే చెబుతూ వచ్చానని నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. కొన్ని అంశాలు తనకు నచ్చకపోవడంతోనే నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. తాను ఎప్పుడూ డబ్బులు తీసుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తిని కాదని, పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు చేశానని తెలిపారు.

ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఇద్దరు నేతలపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటుందా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *