పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు భారతీయుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 22 మంది భారతీయులు మరణించగా వారిలో 14 మంది నావికులు ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వివరాలను వెల్లడించారు.

పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తుండటంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడి భారత దౌత్య కార్యాలయాలు భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని వారి భద్రత కోసం అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తున్నాయని పేర్కొంది.

సౌదీ అరేబియాలోనూ భారతీయుల మృతి

సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇటీవల దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించగా పలువురు గాయపడినట్లు సమాచారం. అలాగే షైబా చమురు క్షేత్రంపై జరిగిన దాడిలో మరో భారతీయుడు గాయపడ్డాడు.

సముద్ర మార్గాల భద్రతపై భారత్ ఆందోళన

యెమెన్‌కు చెందిన హౌతీ దళాలు సౌదీ అరేబియాలోని పౌర కీలక మౌలిక సదుపాయాలపై జరుపుతున్న దాడులపై భారత్ గతంలోనూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి దాడులు ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ముప్పుగా మారడమే కాకుండా అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది.

పశ్చిమాసియాలో పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రతను నిర్ధారించేందుకు సంబంధిత దేశాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *