అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు నగదు సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

తుఫాన్ ప్రభావిత 20 జిల్లాల్లో ఈ సహాయ కార్యక్రమాలు అమలు చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి రూ.1,000, కుటుంబానికి గరిష్ఠంగా రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.

ఇక నిత్యావసర సరుకుల్లో భాగంగా ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. మత్స్యకారులు, చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందిస్తారు. వీటితో పాటు కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార, లీటరు పామాయిల్ ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి కూడా ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3,000, ఒంటరిగా ఉన్న వ్యక్తికి రూ.1,000 చొప్పున తక్షణ సాయం అందిస్తారు.

మరోవైపు సహాయ, పునరావాస చర్యల కోసం పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం రూ.4 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. ఇప్పటికే తుఫాన్ సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్లు కేటాయించింది. ఈ నిధుల నుంచే బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సూచించింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *