విజయవాడ మేయర్ ఎన్నికల వేళ ఓ ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) ఎన్నికల ప్రచారానికి మద్దతుగా ఓ పోలీస్ కానిస్టేబుల్ తన సొంత జీతం నుంచి రూ.40 వేలు విరాళంగా ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకుడు నల్లమోతు చక్రవర్తి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

రెండు గంటలు ప్రయాణించి వచ్చి విరాళం

నల్లమోతు చక్రవర్తి తన పోస్టులో తెలిపిన వివరాల ప్రకారం.. బందరుకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ రాత్రి 8 గంటల సమయంలో సుమారు రెండు గంటల పాటు ప్రయాణించి ఏబీవీ ప్రచార బృందం వద్దకు వచ్చారు. తన సొంత సంపాదన నుంచి రూ.40 వేల చెక్కును అందజేశారు.

అవినీతికి వ్యతిరేకంగా ఏబీవీ చేస్తున్న పోరాటం నచ్చడంతో తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించినట్లు ఆ కానిస్టేబుల్ చెప్పారని చక్రవర్తి పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉండటం అభినందనీయమని తన పోస్టులో అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియాలో భిన్న స్పందనలు

ఈ ఘటనను ప్రస్తావిస్తూ నల్లమోతు చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా “దొంగలు పోవాలి.. పోలీసు రావాలి” అనే నినాదంతో విజయవాడ మేయర్ ఎన్నికల్లో ప్రజలు ఆచితూచి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అయితే ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కానిస్టేబుల్ విరాళం ఇచ్చిన అంశంపై చర్చ జరుగుతుండగా, మరోవైపు ఎన్నికల ప్రచారానికి పోలీసు సిబ్బంది విరాళం ఇవ్వడంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *