అర్నబ్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలకు ముందుకొచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులకు తెలంగాణ విద్యుత్ సిబ్బంది సహకరించనున్నారు.

తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 16 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో దెబ్బతిన్న విద్యుత్ లైన్ల మరమ్మతులు, కూలిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, సరఫరాను పునరుద్ధరించడం కోసం తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని ఏపీ కోరింది. చంద్రబాబుతో పాటు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఈ విషయంపై భట్టి విక్రమార్కతో సంప్రదింపులు జరిపారు.

ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన భట్టి విక్రమార్క.. ఏపీకి అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

దీంతో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొనేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ సహాయక బృందాలను సిద్ధం చేసింది. ఏపీలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఈ బృందాలు సహకరించనున్నాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *