ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పోలింగ్, కౌంటింగ్ సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నామినేషన్ల ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

రిటర్నింగ్ అధికారులపై జగన్ విమర్శలు

నామినేషన్ల సమయంలో రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని జగన్ ఆరోపించారు. నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం, పత్రాలను చించివేయడం, బీ-ఫారాలను మాయం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ఓసీ అభ్యర్థులకు బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఏకగ్రీవాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

పోలింగ్, కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టి

నామినేషన్ల సమయంలోనే అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని జగన్ సూచించారు. పోలింగ్ రోజున రిగ్గింగ్‌కు, స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సుల మార్పిడికి పాల్పడే అవకాశం ఉందంటూ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు.

పోలింగ్ ఏజెంట్లకు ముందుగానే సరైన శిక్షణ ఇవ్వాలని, ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేలా వారిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఓటర్లకు అండగా ఉండి, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలని సూచించారు.

ప్రతి ఘటనకు వీడియో ఆధారాలు సేకరించాలి

ఎన్నికల ప్రక్రియలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే ఆధారాలు, వీడియోలు సేకరించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని సూచించారు.

ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆలస్యం చేయకుండా పార్టీ లీగల్ సెల్ ద్వారా కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *