రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండో విడత కింద రాష్ట్రంలోని 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,125.47 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ఈ మొత్తం నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం రూ.782.55 కోట్లు సమకూరుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.6 వేలు అందిస్తున్నాయని వివరించారు.

అన్నదాత సుఖీభవ పథకం కింద ఖరీఫ్ సీజన్‌లో రూ.7 వేలు, రబీలో రూ.7 వేలు, వేసవి సీజన్‌లో రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు సాగు పెట్టుబడి సమయంలో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.8,985.41 కోట్లు, 2026–27 ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా రూ.3,125.47 కోట్లను రైతులకు అందించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. తాజా రెండో విడత సాయంతో పాటు 2024–25 సంవత్సరానికి సంబంధించిన పీఎం కిసాన్ నిధులను కలిపితే రైతులకు అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ.17,789.80 కోట్లకు చేరుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *