ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతుండగా.. పులివెందుల, పల్నాడు, నంద్యాల, కడప జిల్లాల్లో వివిధ ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

అనకాపల్లి జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిలిచిన పోలింగ్

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ నిలిచిపోయింది. 31, 32, 33, 34 కేంద్రాల్లో ఓటర్ల జాబితాలోని వివరాలకు, ఓటర్ స్లిప్పుల్లోని వివరాలకు సరిపోలకపోవడంతో పోలింగ్‌ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఓటింగ్‌ నిలిచిపోవడంతో ఓటర్లు ఆందోళనకు గురయ్యారు.

నంద్యాల జిల్లాలో వైసీపీ ఏజెంట్లపై దాడి ఆరోపణలు

నంద్యాల జిల్లా గడివేముల మండలం వండుట్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని వైసీపీ పోలింగ్ ఏజెంట్లు ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల నుంచి తమను బయటకు పంపించారంటూ వారు ఆందోళన చేపట్టారు. రిగ్గింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించడంతో ఆ ప్రాంతానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.

కార్యకర్తలు సంయమనం పాటించాలి: చంద్రబాబు

పోలింగ్‌ నేపథ్యంలో కూటమి నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

ఓటింగ్ శాతం తగ్గకుండా చూడాలని, వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహాయం చేయాలని కార్యకర్తలకు సూచించారు. వైసీపీ అక్రమాలకు పాల్పడితే నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, కూటమి శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల బందోబస్తు కోసం 1,827 మంది పోలీసులను నియమించారు. జిల్లాలో 69 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

గురజాలలో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం

పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను కేంద్రాల్లోకి అనుమతించడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. అనుమతి ఉన్నప్పటికీ లోపలికి ఎందుకు పంపడం లేదని పోలీసులను ప్రశ్నించారు.

ఒకేసారి గుంపులుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు.

జూపాడుబంగ్లాలో ఉద్రిక్తత

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని కేజీ రోడ్డుపై వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి నేహా తండ్రిని పోలీసులు స్టేషన్‌కు తరలించడంపై నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

పులివెందుల నియోజకవర్గంలో హైటెన్షన్

పులివెందుల నియోజకవర్గంలోని ఇప్పట్ల, పార్నపల్లె, తుమ్మలపల్లె గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ పోలింగ్ ఏజెంట్లను కేంద్రాల నుంచి బయటకు పంపించారని వైసీపీ నేతలు ఆరోపించారు.

పార్నపల్లెకు చేరుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏజెంట్లను ఎందుకు బయటకు పంపించారని పోలీసులను ప్రశ్నించారు. అనుమతి ఉన్న ఒక్కొక్కరినే లోపలికి పంపిస్తున్నామని పోలీసులు తెలిపారు. సున్నితమైన ప్రాంతం కావడంతో అవినాష్ రెడ్డిని పోలింగ్ బూత్ వైపు వెళ్లేందుకు అనుమతించలేదు.

జమ్మలమడుగులో టీడీపీ ఏజెంట్లను బయటకు పంపారంటూ ఆరోపణలు

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం గుండ్లకుంటలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కూటమి పోలింగ్ ఏజెంట్లను వైసీపీ నేతలు కేంద్రం నుంచి బయటకు పంపించారని వారు ఆరోపించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సోదరుడి కుమారుడు శివారెడ్డి తమను బయటకు పంపించారని కూటమి ఏజెంట్లు ఆరోపించారు.

పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడి

పల్నాడు జిల్లాలోని మప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేయడంతో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

for more:Mptc Zptc election ubdates in Dtv digital

రోడ్డు సదుపాయం కల్పించాలని ఏజెన్సీ గ్రామస్థుల నిరసన

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఓటు వేసేందుకు వెళ్లే విషయంలో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూలపేట పంచాయతీ పరిధిలోని జాజులబంధ గ్రామంలో సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. తమ గ్రామానికి సరైన రహదారి సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

ఓటు వేయాలంటే రోలుగుంట, గొలుగొండ మండలాల మీదుగా మూలపేట పంచాయతీ కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనూ సుమారు ఏడున్నర కిలోమీటర్లు డోలీల సాయంతో ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు గ్రామంలోనే రేషన్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.