ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంగళంలోని సప్తగిరి కాలనీ పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఎదురుపడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చెవిరెడ్డిని అనుసరించిన సుధారెడ్డి

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లగా, సుధారెడ్డి కూడా ఆయన వెంట వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెవిరెడ్డి అన్న ఎక్కడికి వెళ్తే తాను కూడా అక్కడికే వెళ్తానని, అవసరమైతే ఆయన కారులోనే ప్రయాణిస్తానని వ్యాఖ్యానించారు.

రోజంతా ఆయనను అనుసరిస్తానని, కారులో ఎస్కార్ట్‌లా వెంట ఉంటానని స్పష్టం చేశారు. చెవిరెడ్డి ఒకచోట ఆగి ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో సుధారెడ్డి కూడా ఆయన పక్కనే నిలబడ్డారు.

ప్రశాంతంగా ఎన్నికలు జరగాలన్నదే లక్ష్యం

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు వచ్చిన వారిని మాత్రమే అనుమతించాలని సుధారెడ్డి పోలీసులకు సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నదే తన ఉద్దేశమని ఆమె తెలిపారు.

మరోవైపు తిరుపతి రూరల్ మండలం సప్తగిరి నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని అక్కడికి చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

for more:Mptc zptc election ubdates only in dtv digital

పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు

చంద్రగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొత్తం పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు చంద్రగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు.

రికార్డు చేసిన ఫుటేజీని భద్రపరిచి కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

మొత్తంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సుధారెడ్డి మధ్య చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.