D Spiritual: Nov 7: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కాళేశ్వరంలోని ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ఆది ముక్తేశ్వర స్వామి ఆలయం (బాలాలయం)లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ, కార్యనిర్వహణాధికారి మహేష్ తెలిపారు.

నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు కార్తీక మాసం కొనసాగనుంది. ఈ సందర్భంగా బాలాలయంలో నిర్వహించే లక్ష పత్రి పూజను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. బాలాలయం లోపల స్థలం పరిమితంగా ఉండటంతో పూజ సమయంలో భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

నవంబర్ 13న నాగుల చవితి సందర్భంగా ఉదయం 9:30 గంటలకు నాగులమ్మ పుట్ట వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు.

అలాగే, నవంబర్ 23న వైకుంఠ చతుర్దశి సందర్భంగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ నిర్వహించనున్నారు. నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా బాలాలయం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాతో పాటు, రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమం చేపట్టనున్నారు.

గ్రామస్తులకు ప్రత్యేక దర్శన సమయం

కార్తీక మాసం సందర్భంగా గ్రామస్తుల సౌకర్యార్థం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక దర్శన సమయాన్ని కేటాయించినట్లు ఆలయ చైర్మన్, ఈఓ తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకోవాలని, ఆలయానికి సహకరించాలని వారు కోరారు.