
D Educt: Nov 7: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 2027-28 నుంచి కొత్త విధానం!
రాష్ట్రంలో 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో పలు మార్పులు తీసుకురావడానికి ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరఖ్ నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో పరీక్షలు, ప్రశ్నపత్రాల రూపకల్పన, విద్యార్థుల సామర్థ్యాల అంచనా విధానాల్లో ఏకరూపత తీసుకురావడమే పరఖ్ నిబంధనల ప్రధాన ఉద్దేశం.
ఇప్పటికే పరఖ్ నిబంధనలపై ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులకు ఎన్సీఈఆర్టీ కార్యశాల నిర్వహించింది. విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసి సమాధానాలు రాసే విధానానికి స్వస్తి పలికి, విషయ పరిజ్ఞానం, అవగాహన, విశ్లేషణ, సమస్యల పరిష్కారం, సృజనాత్మక ఆలోచనా సామర్థ్యాలను పరీక్షించేలా ప్రశ్నపత్రాలను రూపొందించనున్నారు.
ప్రశ్నపత్రాల్లో 10 శాతం సృజనాత్మక ప్రశ్నలు
పాఠ్యాంశాల్లోని అంశాల నుంచి నేరుగా ప్రశ్నలు ఇవ్వకుండా, విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించేలా ప్రశ్నపత్రాల్లో మార్పులు చేయనున్నారు. విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాలను పరీక్షించేలా 10 శాతం ప్రశ్నలు ఇవ్వాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ఇచ్చిన ప్రశ్నల నుంచే ఎక్కువగా పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, వీటిలో విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని అంచనా వేసే ప్రశ్నలు తక్కువగా ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త విధానానికి అనుగుణంగా ప్రశ్నలను రూపొందించేందుకు సబ్జెక్టు నిపుణుల నుంచి ఇప్పటికే ప్రశ్నలను ఆహ్వానించారు. బోర్డు సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో ముద్రించే పాఠ్యపుస్తకాల్లో కొత్త తరహా ప్రశ్నలను చేర్చనున్నారు.
విద్యార్థుల అవగాహనకు ప్రాధాన్యం
విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని సమాధానాలను యథాతథంగా గుర్తుంచుకోవడానికే పరిమితం కాకుండా, ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని సొంతంగా ఆలోచించి, విశ్లేషించి సమాధానాలు రాసేలా ప్రశ్నలను రూపొందించనున్నారు. ఈ కొత్త విధానానికి అనుగుణంగా బోధన సాగించేలా అధ్యాపకులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు.
సామాజిక, సృజనాత్మక నైపుణ్యాల అంచనా
కొత్త విధానంలో విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాలతో పాటు సమష్టిగా పనిచేసే నైపుణ్యాలనూ అంచనా వేయనున్నారు. ఒక లక్ష్యాన్ని సాధించేందుకు ఇతరులతో కలిసి పనిచేయడం, బాధ్యతలను పంచుకోవడం, భిన్నమైన ఆలోచనలను గౌరవించడం, సమష్టిగా సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అలాగే, విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు, వినూత్న పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం, సమస్యలను విభిన్న కోణాల్లో పరిశీలించే నైపుణ్యాలను సృజనాత్మకత విభాగంలో పరీక్షించనున్నారు. జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలకు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ పరిధిలో ఏర్పాటు చేసిన జాతీయ మూల్యాంకన కేంద్రం పరఖ్ ద్వారా దేశంలో పరీక్షల స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
