
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమకు సరికొత్త అర్థం చెప్పారు. రాయలసీమ అంటే కరవు కాదని.. హార్టీకల్చర్ హబ్‌గా అభివర్ణించారు. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు కేరాఫ్ అడ్రస్ రాయలసీమ అని అన్నారు. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, కియా కార్లు, ఖనిజాలు.. ఇలా రాయలసీమ స్వర్ణ యుగం దిశగా అడుగులు వేస్తోందన్నారు చంద్రబాబు. కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ అంటే.. బీడువారినే భూములు, మోడువారిన బతుకులు.. ఎండిన చెట్లు, మండిన కడుపులు.. ఇది ఒకప్పుడు మాట. కాలం మారింది. నెర్రెలు చీలిన సేద్యపు భూములు.. నేడు ఉద్యానవన పంటలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. పండించేందుకు నీళ్లు లేక, ఉండడానికి ఉపాధి లేక.. పొట్టకూటి కోసం కన్నవారిని,. కట్టుకున్నవారిని వదిలి పరాయి ప్రాంతానికి వలసెళ్లిన సీమ బిడ్డలు.. నేడు ఉన్న ఊరిలో, అయినవారి మధ్యలో సగర్వంగా జీవించేందుకు అడుగులు పడుతున్నాయి. వెక్కిరించిన విధే తలవంచేలా.. సీమ రైతులు సాంకేతికతతో పంటలు పండిస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తున్న రాయలసీమ.. స్వర్ణయుగం దిశగా ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో రాయలసీమకు కొత్త నిర్వచనం చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పరిశ్రమలతో రాయలసీమలో నవశకం మొదలైందన్నారు. ఈ క్రమంలోనే సీమకు చంద్రబాబు సరికొత్త అర్థం చెప్పారు. ఇప్పుడు రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్, రాయల్ ఎన్‌ఫీల్డ్, హార్టికల్చర్, కియా కార్లు, అరుదైన ఖనిజాలు, ఫైటర్ జెట్లు,హీరో బైకులు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ అంటూ చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమ అంటే కరవు నేల కాదని.. జలకళగా అభివర్ణించారు.

