
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలు, ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. దీనికి తోడు సముద్ర మట్టం వద్ద ఏర్పడిన రుతుపవన ద్రోణి, షియర్ జోన్ ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
వచ్చే మూడు రోజుల వాతావరణ సూచనలు
ఉత్తర కోస్తాంధ్ర – యానాం
అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. శుక్రవారం అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలతో పాటు శనివారం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మూడు రోజులూ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర
దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత సాధారణంగా ఉండనుంది. శుక్ర, శని, ఆదివారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. ఇక్కడ కూడా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

