
ఏపీ ప్రజలకు అలర్ట్. నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, రాగల మూడు రోజుల పాటు ఈదురు గాలుల బీభత్సం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. శనివారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగిన అల్పపీడనం మరింత బలపడింది. ఆదివారం ఉదయం 08:30 గంటల సమయానికి ఇది వాయుగుండంగా మారినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కి.మీ., చాంద్‌బలికి ఈశాన్యంగా 60 కి.మీ., పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ-నైరుతిగా 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

