
D Spiritual: Nov 17: నెల్లూరు జిల్లా వరికుంటపాడులో సుమారు రూ.కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ అంకాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అంకాలమ్మ, బంగారమ్మ, పోలేరమ్మ, పోతురాజు విగ్రహాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు.
ప్రతిష్ఠాపన మహోత్సవం అనంతరం శ్రీ అంకాలమ్మ గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన అమ్మవారి ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కోళ్లు, మేకలను నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ మహోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామ వాసులు స్వగ్రామానికి చేరుకోవడంతో వరికుంటపాడులో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామమంతా భక్తి సందడి, ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
