
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సీబీఐ కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. కడప, జూన్8 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సీబీఐ కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి (YS Sunitha Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. మరోవైపు సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గతంలో సీబీఐ దర్యాప్తు సమగ్రంగా జరగలేదని తెలిపారు. ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. కేసులో ఇంకా కొన్ని కీలక అంశాలపై సమగ్ర విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల సీబీఐ, కిరణ్ యాదవ్, చైతన్య రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో వారి ప్రమేయానికి ఎలాంటి ఆధారాలు ఏమీలేవని అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ విషయం న్యాయస్థానంలో ఈరోజు ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపైనే ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి. వాదనలు విన్న సీబీఐ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది.
ఆ రోజు తదుపరి దర్యాప్తు అవసరమా? కాదా? అనే అంశంపై మరిన్ని వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు కూడా సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయిందని, అందువల్ల మరింత దర్యాప్తు అవసరం లేదని వారు వాదించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను సీబీఐ పరిశీలించి నివేదిక సమర్పించిందని నిందితుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.

