
గుంటూరు జిల్లా, జులై 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో విలేజ్ మార్ట్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాల అమ్మకాలు జరగనున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గం లాల్‌పురంలో పైలట్ ప్రాజెక్ట్‌ను ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ (AP Minister Nadendla Manohar) ఈరోజు (సోమవారం) ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈ రోజు 7 విలేజ్ మార్ట్‌లు ప్రారంభించామని తెలిపారు. జగన్ హయాంలో రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
జగన్ హయాంలో రాష్ట్రంలోని 29,750 రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. గ్రామీణ రేషన్ వ్యవస్థలో కార్పొరేట్ తరహా సంస్కరణలు తీసుకువస్తున్నామని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రేషన్ షాపులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా 1,000 మినీ మార్ట్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.
60 రకాల సరకులతో మీ మార్ట్‌లు.
ఓపెన్ మార్కెట్ రేట్ల కంటే రూ.3 నుంచి రూ.4ల తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు, మిల్లెట్స్ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతానికి 60 రకాల సరకులతో మీ మార్ట్‌లు ప్రారంభించినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో 250 రకాల వస్తువులు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. విలేజ్ మార్ట్‌ల్లో కూడా త్వరలోనే డిజిటల్ పేమెంట్స్ అవకాశం కల్పిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

