
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తుది విడతకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మూడో విడతలో భాగంగా 4,273 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 42,794 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కోనసీమ, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో ఈ విడతలో ఎన్నికలు జరగవు.
ఎన్నికలు జరిగే 25 జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన చేపడతారు. 25న నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లను స్వీకరించి, 26న వాటిని పరిష్కరిస్తారు. ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
డిసెంబరు 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. పోలింగ్ పూర్తయిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. అనివార్య కారణాలతో ఆ రోజు ఎన్నిక జరపలేని పరిస్థితి ఏర్పడితే డిసెంబరు 3న నిర్వహిస్తారు. రీపోలింగ్ అవసరమైన చోట కూడా అదే రోజు పోలింగ్ చేపట్టనున్నారు.
