
ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 2017లో ఈ సారె మహోత్సవాలు ప్రారంభించారు. ఈ నెల 26న బంగారు బోనం, సారెను దుర్గామల్లేశ్వరస్వామికి సమర్పించనున్నారు. ఈ నెల 15న మొదటి సారెను ఆలయ అర్చకులు, వేద పండితులు కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించనున్నారు. 25న దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆగస్టు 12న దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఆలయ సిబ్బంది సారెను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆషాఢమాస మహోత్సవాలను ఆలయ కమిటీ నిర్వహిస్తోంది. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15వ తేదీ నుంచి ఈ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. అమ్మవారికి సారె సమర్పించి వైభవోపేతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
2017లో దుర్గగుడి మాజీ ఈఓ సూర్యకుమారి ఆషాఢమాస సారె మహోత్సవాలు ప్రారంభించారు. తెలంగాణకు చెందిన భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ 500 మంది కళాకారులతో కలిసి ఈ నెల 26న బంగారు బోనం, సారెను దుర్గామల్లేశ్వరస్వామి ఆది దంపతులకు భక్తిశ్రద్ధలతో సమర్పించనుంది.
ఆషాఢమాస సారె సమర్పించే బృందాల కోసం ఆలయ కమిటీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దుర్గగుడి కనకదుర్గానగర్ ర్యాంప్ మార్టంలో పైకి చేరుకుని మూలవిరాట్‌కు సారె చూపించిన తర్వాత మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్థుకు చేరే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సారెను సమర్పించిన తర్వాత వారంతా ఇబ్బంది పడకుండా లిఫ్టు, మెట్ల మార్గాల్లో తిరిగి వెళ్లే విధంగా సిద్ధం చేస్తున్నారు.

