జిల్లా పరిషత్ తొలి చైర్మన్‌గా గాలివీడు జడ్పీటీసీ సభ్యుడు సుగవాసి ప్రసాద్‌బాబు, వైస్‌ చైర్‌పర్సన్‌గా పీటీఎం జడ్పీటీసీ సభ్యురాలు తలారి శరణ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలోని బెంగళూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారి కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధ్యక్షత వహించారు. జిల్లాలోని మొత్తం 25 మంది జడ్పీటీసీ సభ్యులకు గాను సమావేశానికి హాజరైన 19 మందితో తొలుత ప్రమాణ స్వీకారం చేయించారు. వైసీపీ తరఫున గెలిచిన ఆరుగురు సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు.

జడ్పీ చైర్మన్ పదవికి సుగవాసి ప్రసాద్‌బాబు పేరును పుంగనూరు, కురబలకోట జడ్పీటీసీ సభ్యులు నరసింహులు, సురేంద్రయాదవ్ ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన సభ్యులందరూ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అదేవిధంగా వైస్‌ చైర్‌పర్సన్ పదవికి తలారి శరణ్య పేరును కేవీపల్లె, కలకడ జడ్పీటీసీ సభ్యులు రెడ్డి మహేంద్ర, వెంకటరమణ ప్రతిపాదించగా మిగిలిన సభ్యులు మద్దతు తెలిపారు.

ఇరు పదవులకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో సుగవాసి ప్రసాద్‌బాబు, తలారి శరణ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్ ప్రకటించారు. అనంతరం వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: సుగవాసి ప్రసాద్‌బాబు

జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం సుగవాసి ప్రసాద్‌బాబు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి: కలెక్టర్

నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ పాలకవర్గానికి కలెక్టర్ నిశాంత్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి పాలకవర్గ సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని కోరారు.

జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కార్యక్రమం ముగిసిన అనంతరం నూతన చైర్మన్, వైస్‌ చైర్‌పర్సన్ ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *