
పాలకొండ పట్టణం రాష్ట్రస్థాయి కరాటే పోటీలతో సందడిగా మారింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం 70వ స్టేట్ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 800 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఈవో బ్రహ్మాజీరావు క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు వయస్సు, బరువు విభాగాల వారీగా తలపడ్డారు. అండర్-14 బాలికల విభాగంలో విజేతలకు డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తి పతకాలు అందజేశారు. మరోవైపు పోటీల నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించామని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు.
ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. పోటీలు ప్రారంభమైన అనంతరం నిర్వాహకులను తన కార్యాలయానికి పిలిపించి ఏర్పాట్లపై ఆరా తీశారు. క్రీడాకారులకు కనీస వసతి సదుపాయాలతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.
అండర్-14 బాలికల విభాగంలో పతక విజేతలు:
పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో వివిధ బరువు విభాగాల్లో క్రీడాకారిణులు పతకాలు సాధించారు.
- మైనస్ 18 కేజీలు: కర్నూలుకు చెందిన కె. కావ్యశ్రీ స్వర్ణం, చిత్తూరుకు చెందిన జి. మోక్షిత రజతం, విజయనగరానికి చెందిన సీహెచ్. హైమావతి కాంస్యం సాధించారు.
- మైనస్ 22 కేజీలు: విజయనగరానికి చెందిన డోలశ్రీ బంగారు పతకం, పశ్చిమగోదావరికి చెందిన జి. ద్వారక రజత పతకం సాధించారు. గుంటూరుకు చెందిన నోషిత, కడపకు చెందిన దీక్షిత కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
- మైనస్ 24 కేజీలు: కె. షెట్టి స్వర్ణం, విశాఖకు చెందిన పూజిత రజతం సాధించారు. కర్నూలుకు చెందిన సీహెచ్. లావణ్య, గుంటూరుకు చెందిన ఎం. సింధూ కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
- మైనస్ 26 కేజీలు: కర్నూలుకు చెందిన రక్షిత, విశాఖకు చెందిన త్రిషిక, చిత్తూరుకు చెందిన శశికల విజేతలుగా నిలిచారు.
- మైనస్ 30 కేజీలు: కృష్ణాకు చెందిన అఫ్రీనా, తూర్పుగోదావరికి చెందిన హనుజ, చిత్తూరుకు చెందిన ప్రియా, కర్నూలుకు చెందిన రవిత విజయం సాధించారు.
- మైనస్ 34 కేజీలు: కడపకు చెందిన దీపిక, చిత్తూరుకు చెందిన ప్రణీత, విశాఖకు చెందిన సాన్వీ, పూజా గెలుపొందారు.
స్టేట్ కరాటే అసోసియేషన్ ఏపీ టెక్నికల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారంతో పోటీలు ముగియనున్నాయి. కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ రామకృష్ణ, డివిజనల్ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ వెంకటరమణ, ఇతర అధికారులు, పీడీలు, కోచ్లు పాల్గొన్నారు.
